2022 సూర్య గ్రహణం ఎప్పుడు ?
శ్రీ శుభకృత్ ఆశ్వీజ అమావాస్య 25 అక్టోబర్ 2022 మంగళవారం తులారాశి స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణ ముగింపు భాగం మాత్రమే భారతదేశంలో కనపడును. పాక్షిక సూర్యగ్రహణ ముగింపు సమయము, భారత్ లో ప్రాంతీయ సూర్యాస్తమయముల వరకే కనపడును. ఈ గ్రహణము అనేక శతాబ్దాల తరువాత వచ్చినదని పలువురు అనుకోవడం వాస్తవం కాదు. 24 అక్టోబర్ సోమవారం దీపావళి, లక్ష్మీపూజ కార్యక్రమాలకు గ్రహణ ఆటంకములు వుండవు. భారత్, యూరప్, ఈశాన్య ఆఫ్రిక, పశ్చిమ ఆసియాలలో కనపడును.
సూర్య గ్రహణంలో ఆచరించాల్సిన నియమాలు
భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణ స్పర్శ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు ముగియును. భారతదేశంలో ప్రాంతీయ సూర్యాస్తమయం వరకే గ్రహణం కనపడును. అక్టోబర్ 25 నాటి సూర్యగ్రహణం ఖగోళంలో అపరాహ్ణంలో ప్రారంభమగును. ఆశ్వీజ అమావాస్య ఆబ్దికము (తద్దినము, మాసికములు) గ్రహణాంతరము స్నానం ఆచరించి, వంట చేసుకున్న పిదప శ్రాద్ధం నిర్వహించాలి. కర్త, కర్త భార్య, భోక్తలు భుజించవచ్చును. ఒకవేళ వైధవ్య స్త్రీలు కర్తలైనప్పుడు, ఆనాటి రాత్రి భోజనం నిషేధం అయినందున, ఆరోజున ఉపవశించి, రెండవ రోజున కార్యమును నిర్వహించుకోవాలి. గ్రహణమును ప్రత్యక్షంగా వీక్షించవద్దు. గర్భవతులు గృహంలో వుండి కార్యములన్నింటిని ఆచరించవచ్చును. మల, మూత్ర విసర్జన కూడా చేయరాదని కొందరు చెప్పే మాటలు వాస్తవాలు కాదు. టీవీలలో చూపించే గ్రహణ దృశ్యాలను గర్భవతులు చూడవచ్చును.
ధర్మ శాస్త్ర నిర్ణయాల మేరకు దీపావళి పర్వదినాన్ని మరియు లక్ష్మీ పూజను ముందు రోజే అనగా 24 అక్టోబర్ సోమవారం ఆచరించుకోవాలి. అక్టోబర్ 24 నరకచతుర్దశి ప్రయుక్త తైలాభ్యంగనము, హారతులు మొదలైనవి 24 సూర్యోదయ పూర్వము ఆచరించేది.
అక్టోబర్ 24 దీపావళిన లక్ష్మి పూజ, వ్యాపార పుస్తక ప్రారంభ సమయాలు
ఉదయం 7.48 నుంచి 10.02 మరియు మధ్యాహ్నం 2.03 నుంచి 3.42.
ప్రదోష ప్రయుక్త స్థిర లక్ష్మీపూజ 24 రాత్రి 7.02 నుంచి 9.03 వరకు.
నిశీధి కాల లక్ష్మీపూజ : 24 రాత్రి 11.27 నుంచి 12.17 వరకు.
ఇక భారతదేశంలో ఏయే ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణములు ఏ సమయంలో జరుగుతాయో మరొక పోస్ట్ లో తెలుపుకుందాం – పొన్నలూరి శ్రీనివాసగార్గేయ
2 comments
Thanks a lot sir
subham