Home Blogs పంచాంగంలో ఆదాయ వ్యయ నిర్ణయం ఖచ్చితమేనా….?

పంచాంగంలో ఆదాయ వ్యయ నిర్ణయం ఖచ్చితమేనా….?

by gargeyaastro

సాధారణంగా ఉగాది రాగానే అందరూ పంచాంగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాశి ఫలాలు ఎలా ఉన్నా… ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయన్న ఉత్కంఠే అందరిలో ఎక్కువ. ఆదాయం 14 వ్యయం 2 ఉందనుకోండి…. సంబరపడిపోతారు. అదే ఆదాయం 2 వ్యయం 14 ఉందనుకోండి చతికిలపడిపోతారు.

ఇక్కడే ఒక సంచలనాత్మకమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నా. నా 40 సంవత్సరాలు దాటిన‌ సుదీర్ఘ జ్యోతిష శాస్త్ర అనుభవంతో నేను తెలుసుకున్న సంచలనాత్మక అంశం ఇది.
పంచాంగంలో వచ్చే ఆదాయ-వ్యయ నిర్ణయాలు ఖచ్చితమైనవి కావు. జ్యోతిషశాస్త్ర ప్రామాణిక‌ గ్రంధాలు పేర్కొన్న‌ ప్రకారం ఉగాది పర్వదినం వచ్చిన‌ వారాన్నిబట్టి ఆదాయ- వ్యయ నిర్ణయాలు జరుగుతాయి. ఉదాహరణకు ఆదివారం ఉగాది వస్తే…. ఒక్కో రాశికి ఆదాయం ఇంత, వ్యయం ఇంత అని ఉంటుంది. సోమవారం ఉగాది వస్తే మరోలా…. మంగళవారం ఉగాది వస్తే ఇంకోలా….. అదే విధంగా బుధ…. గురు…. శుక్ర…. శని వారాలకి కూడా స్థిరమైన సంఖ్యా నిర్ణయాలున్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ వారాలను బట్టి చేశారే తప్ప, ఆ సంవత్సరంలో ఉండే వ్యతిరేక గ్రహస్థితులు… అనుకూల గ్రహస్థితులను బట్టి చేయలేదు. ఒక్కో సంవత్సరంలో అధిక గ్రహణాలు, చతుర్గ్రహ…. పంచగ్రహ….. షట్గ్రహ కూటములూ ….. పాప, శతృగ్రహ సంఘర్షణలూ ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక్కో రాశికీ ఆయా గ్రహస్థితులను బట్టి ఎంత ఆదాయం‌ ఉంటుంది….. ఎంత వ్యయం ఉంటుందీ నిర్థారించాలి. మరికొన్నిసార్లు కాలసర్పయోగాలు …… గురుఛండాల యోగాలు …. నాగదోషాలు ఇత్యాదులు ఎన్నో ఉంటుంటాయి. రెండు సంవత్సరాల క్రితం ఒకే సంవత్సరంలో వచ్చిన పలు కాలసర్పయోగాల కారణంగా కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలమైపోయింది.

మరి ఇలాంటి దారుణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆదాయ – వ్యయాలను కేవలం‌ ఉగాది వచ్చిన వారాన్ని బట్టి నిర్ణయించడం అనేది ముమ్మాటికీ తప్పే. మార్కెట్ లో వస్తువులకు నిర్ణీతధర(ఫిక్స్ డ్ రేట్) లాగా ఆదాయ – వ్యయ నిర్ణయం చేయడం అసంబద్ధం, అనుచితం‌ కూడా. నేనిలా చెప్పడం నా తోటి పంచాంగకర్తలందరికీ తీవ్ర ఆగ్రహాన్ని, అసౌకర్యాన్ని కలుగచేస్తుందని‌ నాకు తెలుసు. పంచాంగ, జ్యోతిష శాస్త్ర నిర్ణయాలను ఎంత కఠినమైనా నిక్కచ్చిగా చేసే నేను… ప్రతి ఉగాదికీ ఈ అంశాన్ని మీ ముందుకు తేవాలని మథనపడుతూనే ఉన్నాను. ఈ అంశాన్ని‌ వెల్లడించడం‌ వల్ల కలిగే కష్టనష్టాలు ఎలాగైనా వుండనీయండి…. ఈ కఠోర నిజాన్ని నా పాఠకులకు, ప్రణతీ టెలివిజన్ ప్రేక్షకులకు చెప్పితీరాలనే కఠిన నిర్ణయంతోనే మీ ముందుకు వచ్చాను.

వ్యక్తిగత జాతకంతో మీరందరూ నన్ను సంప్రదించాలనే నేనిలాంటి అంశాన్ని బహిర్గతం చేస్తున్నానని చాలామంది విమర్శించవచ్చు. అది సబబు కాదు. ఓ కఠినమైన‌ నిజాన్ని అందరితో పంచుకోవాలన్నదే నా ప్రధాన లక్ష్యం. పంచాంగాలలో కనిపించే ఆదాయ – వ్యయ పట్టికలను చూసి భయపడకండి. దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి…ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. కొన్ని లక్షలమందికి ఒకే రాశి ఉండవచ్చు. ఆ రాశికి చెప్పే ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయా అంటే…. ఉండకపోవచ్చు. చాలా వరకు వ్యక్తిగత జాతకాన్ని బట్టి, ఆ జాతకంలో ఉండే గ్రహస్థితులను బట్టి రాశి ఫలితాలు మారే అవకాశం చాలా ఉంటుంది. అందువల్ల ఆందోళన చెందకుండా చిన్న చిన్న‌ పరిహారాలు చేసుకుంటూ సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

You may also like

Leave a Comment