Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Wednesday, September 16, 2026 @ 8:55 am
  • Facebook
  • Twitter
  • Instagram
  • Email
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Wednesday, September 16, 2026 @ 8:55 am
Gargeya Astro
Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us
Copyright 2024 - All Right Reserved
Blogs

పాక్షిక సూర్య గ్రహణం 25 అక్టోబర్ 2022 – Surya Grahanam 2022

by gargeyaastro October 18, 2022
written by gargeyaastro

2022 సూర్య గ్రహణం ఎప్పుడు ?

శ్రీ శుభకృత్ ఆశ్వీజ అమావాస్య 25 అక్టోబర్ 2022 మంగళవారం తులారాశి స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణ ముగింపు భాగం మాత్రమే భారతదేశంలో కనపడును. పాక్షిక సూర్యగ్రహణ ముగింపు సమయము, భారత్ లో ప్రాంతీయ సూర్యాస్తమయముల వరకే కనపడును. ఈ గ్రహణము అనేక శతాబ్దాల తరువాత వచ్చినదని పలువురు అనుకోవడం వాస్తవం కాదు. 24 అక్టోబర్ సోమవారం దీపావళి, లక్ష్మీపూజ కార్యక్రమాలకు గ్రహణ ఆటంకములు వుండవు. భారత్, యూరప్, ఈశాన్య ఆఫ్రిక, పశ్చిమ ఆసియాలలో కనపడును.

సూర్య గ్రహణంలో ఆచరించాల్సిన నియమాలు

భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణ స్పర్శ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు ముగియును. భారతదేశంలో ప్రాంతీయ సూర్యాస్తమయం వరకే గ్రహణం కనపడును. అక్టోబర్ 25 నాటి సూర్యగ్రహణం ఖగోళంలో అపరాహ్ణంలో ప్రారంభమగును. ఆశ్వీజ అమావాస్య ఆబ్దికము (తద్దినము, మాసికములు) గ్రహణాంతరము స్నానం ఆచరించి, వంట చేసుకున్న పిదప శ్రాద్ధం నిర్వహించాలి. కర్త, కర్త భార్య, భోక్తలు భుజించవచ్చును. ఒకవేళ వైధవ్య స్త్రీలు కర్తలైనప్పుడు, ఆనాటి రాత్రి భోజనం నిషేధం అయినందున, ఆరోజున ఉపవశించి, రెండవ రోజున కార్యమును నిర్వహించుకోవాలి. గ్రహణమును ప్రత్యక్షంగా వీక్షించవద్దు. గర్భవతులు గృహంలో వుండి కార్యములన్నింటిని ఆచరించవచ్చును. మల, మూత్ర విసర్జన కూడా చేయరాదని కొందరు చెప్పే మాటలు వాస్తవాలు కాదు. టీవీలలో చూపించే గ్రహణ దృశ్యాలను గర్భవతులు చూడవచ్చును.

ధర్మ శాస్త్ర నిర్ణయాల మేరకు దీపావళి పర్వదినాన్ని మరియు లక్ష్మీ పూజను ముందు రోజే అనగా 24 అక్టోబర్ సోమవారం ఆచరించుకోవాలి. అక్టోబర్ 24 నరకచతుర్దశి ప్రయుక్త తైలాభ్యంగనము, హారతులు మొదలైనవి 24 సూర్యోదయ పూర్వము ఆచరించేది.

అక్టోబర్ 24 దీపావళిన లక్ష్మి పూజ, వ్యాపార పుస్తక ప్రారంభ సమయాలు

ఉదయం 7.48 నుంచి 10.02 మరియు మధ్యాహ్నం 2.03 నుంచి 3.42.

ప్రదోష ప్రయుక్త స్థిర లక్ష్మీపూజ 24 రాత్రి 7.02 నుంచి 9.03 వరకు.

నిశీధి కాల లక్ష్మీపూజ : 24 రాత్రి 11.27 నుంచి 12.17 వరకు.

ఇక భారతదేశంలో ఏయే ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణములు ఏ సమయంలో జరుగుతాయో మరొక పోస్ట్ లో తెలుపుకుందాం – పొన్నలూరి శ్రీనివాసగార్గేయ

October 18, 2022 2 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

రాహు అనుగ్రహానికి గోధుమపిండి దీపారాధన 5

by gargeyaastro August 3, 2022
written by gargeyaastro

నవగ్రహ ఆధిపత్యాలన్ని మన శరీరంలోనే ఉన్నాయి. ఇందులో  మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు. స్వాదిష్టాన చక్రానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు. మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం రవి. అనాహత చక్రానికి ఆధిపత్య గ్రహం బుధుడు. విశుద్ది చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు. ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని. ఈ ఆరు చక్రాల పైన తలమానికగా ఉంటూ పాలించేది, నియంత్రించేది మరొకటి బ్రహ్మ రంధ్రంలో ఉండును. దానినే సహస్రార చక్రము అంటారు. దీని ఆధిపత్య గ్రహం చంద్రుడు. కనుక నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఈ చక్రాలకు ఆదిపత్యంగా నిలుస్తున్నాయి.  మూలాధార చక్రంలోని సర్పాకారంలో ఉన్న కుండలినే రాహు కేతువులుగా తీసుకోవాలి. తల భాగాన్ని రాహువని, తోక భాగాన్ని కేతువని పిలుస్తారు.

మానవాళికి సమస్యలుంటుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఈ రెండింటికీ ప్రధాన కేంద్ర బిందువులు రాహు, కేతువులే అన్న నగ్న సత్యం నూటికి 90 మందికి తెలియదు. కనుక ఈ రాహు, కేతువులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తృప్తి కల్గించటానికి ఎన్నెనో పద్ధతులున్నాయి. ఈ పద్దతులలో తాంత్రిక మార్గంలో ఆచరించేది గోధుమపిండి దీపారాధన.

ఏడు వారాలలో రాహు కాలము ఒక్కోరోజున ఒక్కో సమయంలో ఉంటుంది. ఆరుగంటలకి సూర్యోదయం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకి సూర్యుడు అస్తమించాడు అనుకుందాం ఈ సమయాన్ని ఎనిమిది భాగాలుగా విభజిస్తే ఒక్కో భాగానికి గంటన్నర సమయం ఉంటుంది. అనగా తొంబై నిముషాలు. ఈ ఎనిమిది భాగాలలో మొదటి భాగం అనగా ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిముషాల వరకు రాహుకాలం ఉండదు.

మిగిలిన సమయాలను పరిశీలిస్తే ఉదయం 7.30 నుంచి 9.00 గంటలు సోమవారానికి,  9.00 నుంచి 10.30 గంటలు శనివారానికి, 10.30 నుంచి 12.00 గంటల వరకు శుక్రవారానికి, మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 1.30 వరకు బుధవారానికి,  1.30 నుంచి 3.00 గంటల వరకు గురువారానికి, 3.00 నుంచి 4.30 గంటల వరకు మంగళవారానికి, సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఆదివారానికి రాహుకాలం కేటాయించబడింది. ఒకటవ భాగ సమయం ఏ వారంలోనూ కేటాయించబడలేదు. ఈ సమయంలో రాహు, కేతువులను ప్రత్యక్షంగా ప్రార్ధించాలంటే ఉన్న ఏకైక మార్గం గోధుమ పిండి దీపారాధన.

గ్రహ రాజు సూర్యుడు. సూర్యుని యొక్క క్షేత్రమే సింహ రాశి. సూర్యుని యొక్క వారమే ఆదివారం. కనుక ఈ ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 వరకు ఉన్న సమయంలోనే, రాహు కేతు ప్రభావం మానవాళిపై ఉండకుండా ఉండుటకై ప్రతివారు ప్రయత్నం చేయవచ్చు. అగ్ని తత్వంతో ఉండే చక్రమే మణిపూరక చక్రము. దీనికి అధిపతి సూర్యుడు. అగ్ని తత్త్వం కనుక ఆహారాన్ని మండించి దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ చక్రం నాభి స్థానంలో ఉంటుంది. ఆహారాన్ని జీర్ణింప చేసి, జీర్ణింపబడిన ఆహారం నుంచి శక్తిని నిల్వచేయటం, శారీరక అవసరాలకు తగిన విధంగా శక్తిని అందించటం ఈ చక్రం యొక్క విధి. అంతేకాక మానసిక పరమైన అధికారాన్ని కూడా నియంత్రిస్తుంది.

గ్రహరాజైన సూర్యుని యొక్క తేజస్సే సమస్త మానవాళి బ్రతుకుటకు అవసరమైన ఆహారాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందించి, సకల జీవకోటికి జీవనాధారంగా నిలిచిన దేవతా మూర్తే శ్రీ సూర్య నారాయణుడు. జ్యోతిషపరంగా సూర్యుని యొక్క ధాన్యము గోధుమ, వారము ఆదివారము. కనుక రాహుకాలము లేనటువంటి ఉదయం 6.00 నుంచి 7.30 సమయాన్ని ఆదివారము నాడు కేటాయించుకోవాలి. ఈ సమయంలోనే ఓ 50 గ్రాముల పొట్టు తీయని గోధుమపిండిని తీసుకొని, అందులో ఆవుపాలు లేక బర్రెపాలు అవకాశం లేకపోతే జలంతోనైనా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. (మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో పొట్టు ఉండదు. కనుక ఒక కేజీ గోధుమలను కొని, వాటిని పిండి పట్టిస్తే అందులో పొట్టు కలిసి ఉంటుంది. పొట్టు తీయని గోధుమపిండితో స్వీకరించిన ఆహారం వలన ప్రయోజనాలు చాలా మెండు. కానీ ప్రస్తుత రోజులలో పొట్టు పూర్తిగా తీసిన గోధుమ పిండినే మార్కెట్లో విక్రయిస్తుంటారు. కనుక ఈ పూజకు పొట్టుతో ఉన్నది అవసరం కనుక… ఎవరికి వారు ముందుగా గోధుమలను కొని పిండి పట్టించుకొనేది. శనివారం నాడు మాత్రం గోధుమలను కొనవద్దు. ఇది ముఖ్య గమనికగా తెలుసుకోండి. మిగిలిన వారాలలోనే గోధుమలను కొని పిండి పట్టించి నిల్వ చేసుకోండి.)

పై విధంగా ముద్ద చేసిన గోధుమల పిండిని చిన్న ప్రమిదలాగా చేసుకొని రెండు వత్తులను కలిపి ఒక మధ్య వత్తిగా (కుండ వత్తి ) వేసుకోండి. దీనిలో ఆవునెయ్యి లేదా కొబ్బరి నూనెను వినియోగించండి. ఇది కేవలం ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 లోపలనే కుటుంబ సభ్యులలోని ఎవరో ఒకరు తయారుచేసి వెలిగించండి. వెలిగించిన జ్యోతిని గదిలో బాహాటంగా ఒక ప్రదేశంలో ఉంచితే దాని కాంతిని పూర్తి స్థాయిలో చూడలేము. అందుకని తక్కువ వైశాల్యం ఉన్న ప్రదేశంలో ఈ జ్యోతిని ఉంచినప్పుడు ఆ కాంతి, తక్కువ వైశాల్యమున్న ప్రాంతానికి బాగా ప్రసరిస్తుంది.

కనుకనే ఓ పెద్ద ఖాళీ గిన్నెలో కాని లేక మీకు అందుబాటులో ఉన్న తత్సమానమైన దానిలో… అడుగున స్వల్పంగా పసుపు, కుంకుమను చల్లి దానిపై గోధుమ పిండి జ్యోతిని ఉంచండి. గిన్నె వైశాల్యము తక్కువగా ఉంటుంది కనుక కాంతి అధికంగా గిన్నె లోపల ప్రసరిస్తుంది. ఈ గిన్నెను గృహంలో ఎక్కడైనా ఉంచండి. ఫలాని ప్రాంతంలోనే ఉంచాలనే నియమం ఏమి లేదు.

ఆదివారం ఉదయం 6.00 నుంచి 7.30 లోపల మాత్రమే జ్యోతి వీక్షణం జరగాలి. అనగా కుటుంబంలోని అందరు వ్యక్తులు అవకాశమున్నంత సేపు ( ఒక్కో  నిముషానికి తక్కువ కాకుండా… రెప్పవేసినా ఫర్వాలేదు ) జ్యోతి దర్శనం భక్తితో విశ్వాసంతో చేసుకోండి. 7.30 తర్వాత జ్యోతి వీక్షణం చేసిననూ ప్రయోజనముండదు. కనుక ఈ సమయంలోనే మిగిలిన పనులు ఎన్ని ఉన్నప్పటికీ… రాహువు యొక్క అనుగ్రహం పొందటానికి  చేసే అద్భుత పరిహార ప్రక్రియ కోసం కొన్ని నిముషాలు కేటాయించుకోండి.

ఇక ఈ జ్యోతికి ఆ సమయంలో నైవేద్యం ఇవ్వాలా? వద్దా ? అనే మీమాంశ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయాన్నీ గమనించండి. గత పోస్టింగ్ లో తెల్పిన కట్టె పొంగలిని ఆదివారం నాడు తయారు చేసుకొనండి. ఈ పొంగలిని జ్యోతి వద్దనే నివేదించాలనే నియమం ఏమి లేదు. మీ పనులు పూర్తి చేసుకుంటూ… పూజ మందిరంలో ఎటు తిరిగి దీపారాధన చేసుకుంటారు కనుక… అక్కడ మీకు అనువైన సమయంలో… ఆ మందిరంలో ఉండే ఏ దేవతా మూర్తులకైనా ఈ పొంగలిని నివేదించండి. కట్టె పొంగలి నైవేద్యాన్ని చేసినప్పటి నుంచి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైననూ ప్రసాదంగా స్వీకరించండి. 

ఉదయం 7.30 తదుపరి నుంచి గోధుమ పిండి జ్యోతిలో నేతిని లేక కొబ్బరి నూనెను వేయవద్దు. అలాగే కొండెక్కును. ఈ జ్యోతిని వెలిగించుటకు లేక వీక్షించుటకు ప్రత్యేక శిరః స్నానములు అవసరం లేదు. మనః శుద్ధి ముఖ్యము. గృహంలో కదలలేని వృద్దులేవరైన ఉన్నచో, వారి చెంతకు గిన్నెను తీసుకొని వెళ్లి జ్యోతి దర్శనం చేయించండి చాలు. ఇక్కడ శరీర శుద్ధి కంటే మనః శుద్ధికే ప్రాధాన్యత అధికము.

జ్యోతి దర్శనం తదుపది మీ మీ నిత్య కార్యక్రమాలను ఆచరించుకొనండి. నివేదనను జ్యోతికే వద్దనే ఇవ్వవలసిన అవసరం లేదని మరీ మరీ గుర్తుంచుకొనండి. ఆదివారం నాడు కట్టె పొంగలిని ప్రసాదంగా గాని లేక ఆహారంగా గాని స్వీకరిస్తే… మూలాధార చక్రంలో పరివేష్టితురాలైనా సాకిన్యంబా అనుగ్రహం లభించటమే కాక జ్యోతి దర్శనం ద్వారా కుండలిలో ఉన్న రాహుగ్రహ అనుగ్రహం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉంటుందనేది పురాతన గ్రంధ సారాంశం.

జ్యోతి కొండెక్కిన తదుపరి ఈ ముద్దను ఎక్కడంటే అక్కడ విసర్జించవద్ధు. పాలతో కలిపి ఉంటారు కనుక దానిని ఎండలో ఉంచితే గట్టి పడుతుంది. చెడు వాసన రాకుండా ఉంటుంది. తిరిగి దానిని  గృహంలోనే ఓ ముఖ్య స్థలంలో భద్రంగా ఉంచుకొనండి. తదుపరి ఆదివారం రోజున మరొక జ్యోతిని పిండితో చేసుకున్నంత వరకు ఈ ఎండిన పిండి ముద్దను విసర్జించకూడదు. పొరపాటున కనపడకపోయిననూ లేక ఏదైనా ఇతరత్రా జరిగిననూ దిగులు చెందవద్దు. తదుపరి ఆదివారం నాడు ఓ మగ్గులో కొద్ది గంటలు ఎండిన జ్యోతిని నానబెట్టి , ఆనాటి రాత్రి లోగా గృహంలో ఉండే వృక్షాల మొదట్లో నీటితో సహా ముద్దని విసర్జించండి.

రెండవ వారం ఏదేని కారణాలచే వెలిగిన్చలేదనుకుందాం. వెలిగించే వారం వరకు ఎండిన ముద్దను అలాగే ఉంచండి. దీనిని ఒక కాగితంలో గాని, ఒక కవర్ లో గాని కట్టి ఉంచండి. ఈ ప్రకారంగా ప్రతి ఆదివారం గోధుమపిండి జ్యోతి వీక్షణను దర్శి స్తుంటే రాహు అనుగ్రహాన్ని పొందవచ్చు. కనుక కేవలం గురు చండాల యోగానికి మాత్రమే కాకుండా మానవాళి శ్రేయస్సుకై ఆచరించే తాంత్రికారాధనే  గోధుమపిండి దీపారాధన.  – శ్రీనివాస గార్గేయ 

August 3, 2022 5 comments
1 FacebookTwitterPinterestEmail
Blogs

మూలాధార కుండలినీ – గోధుమపిండి దీపారాధన 4

by gargeyaastro August 3, 2022
written by gargeyaastro

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 36వ శ్లోకంలోని 2వ పంక్తి లోని కుళామృతైకరసికా నుంచి 40వ శ్లోకంలోని రెండవ పంక్తి చివరలో ఉన్న బిసతంతుతనీయసీ వరకు గల శ్రీ లలితా దేవి నామాలను పరిశీలిస్తే… 90వ నామమే కుళామృతైకరసికాయై నమః. అలాగే 111వ నామము బిసతంతుతనీయస్యై నమః వరకు గల 22 నామాలలో కుండలినీ స్వరూపము ఆవిష్కృతం కాబడినది. భారతీయ దేవాతాకృతుల నిర్మాణము వెనుక దాగి ఉన్న రహస్యమును తెలుసుకొనుటకు మంత్రం శాస్త్ర రహస్యములు కూడా కొన్నింటిని మనము తెలుసుకొని ఉండాలి. 

నస్వర్గే నచ తీర్థేషు నౌషధేషు నభేషుచ
ఋషయో దేవతాస్సంతిమంత్రాయేవసు దేవతాః
సాధకానాం ఫలందాతుం తత్తద్రూపం సురైః
ముఖ్యంస్వరూపం తేషాంతుమంత్రాయేవ నచేతరే ॥
అనగా స్వర్గములో, తీర్ధములలో, ఓషదులలో, ఆకాశములలో దేవతలుండరు. ఋషులు, దేవతులు కూడా మంత్రము నందే ఉందురు. మంత్రములే దేవతాకృతులు. సాధకులను అనుగ్రహించుటకు దేవతలు నిత్యము అనేక ఆకృతులను మంత్రానుష్టానమునకు తగిన రీతిలో ధరింతురు. ఆ మంత్రశక్తి ప్రధానముగా కుండలినీ స్వరూపములో ఉండును. కనుక యోగము, మంత్రము, రూపము మూడింటికీ ఓ అవినాభావ సంబంధమున్నది.

ఈ కుండలినీ శక్తి మూలాధార స్వరూపమైన ప్రధమ చక్రమందు ఉండును. నోటితో తోకనుపట్టుకున్న సర్పము లాగా మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రిస్తూ మూలాధార చక్రంలో ఉండును. లలితా సహస్ర నామ స్తోత్రమునందలి 106వ శ్లోకంలోని రెండు లైన్లు, 107వ శ్లోకంలోని మొదటి లైన్ ను పరిశీలిస్తే… 514, 515, 516, 517, 518, 519, 520 అను 7 నామాలలో మూలాధార చక్రం యొక్క అంశములన్నియు వర్ణింపబడినవి.

మూలాధార చక్రములో ఉన్న తల్లి పేరు సాకినీ దేవి. పృథ్వి తత్వ రూపముతో సృష్టికంతటికీ ఆధారంగా పసుపు వర్ణములో ఉండును. ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. అలాగే ఈ మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు.  ఇందలి సాకిన్యాంబ దేవతనే సిద్ధవిద్యా దేవి అని పిలుచుదురు. వరదాదినిషేవితా నామానికి అర్ధమేమంటే వరదా మొదలైన దేవతలచే సేవింపబడుచున్నదని అర్థము. మూలాధారంలో సరస్వతీ దేవి విద్యా సంబంధమైన నాద శక్తిగా ప్రతిపాదింపబడుతున్నది. నాదం యొక్క ఉత్పత్తి స్థానం కూడా మూలాధారము.

విత్తనము లేనిదే వృక్షము లేదు గనక, ఈ మూల నాదము లేకపోతే పలుకే ఉండదు. కనుక వాగ్దేవతకే మూలమైన స్వరూపమైనందున అంకుశము, ఢమరుకము, పుస్తకము, జ్ఞానముద్రను కలిగి ఐదు శిరస్సులతో ఉండును. వేదములలో వర్ణించిన సరస్వతీ సూక్తులన్నీ ఇక్కడ భావించవచ్చును. పరోక్షంగా ఈ మూలాధార చక్రంలోని సాకిన్యాంబ దేవతను అస్థి దేవత ( అస్థిసంస్థితాయై నమః) అని కూడా పిలుస్తారు. అనగా ఎముకలకు అధిష్టాన  దేవత అని అర్ధము.

గర్భస్థ పిండ విషయములో 5వ మాసములోనే వెన్నెముక ఏర్పడి చర్మ ధాతువును ఏర్పరుచుకొనును. సాకిన్యాంబ స్వరూపములో ఉన్న లలితా పరాభట్టారికను ఆరాధిస్తే ఎముకల పుష్టి కలగటమే కాక పరోక్షంగా అనేక దుర్యోగములు పోవునని పురాతన గ్రంధములు తెలియచేస్తున్నాయి. ఈ సాకిన్యాంబ దేవతకు ముద్గౌదనము తయారుచేసి నివేదన ఇచ్చి ప్రసాదముగా స్వీకరించినందున ఎముకల పుష్టి కలగటమే కాక, అపూర్వ శక్తుల ప్రభావంచే ఛాయా గ్రహముల ద్వారా వచ్చే దుర్యోగములు తొలగును. ఈ తల్లినే ముద్గౌదనాసక్తచిత్తా (519వ నామం) అందురు. ముద్గర అనగా పెసలు. ఓదనము అనగా అన్నము. పెసలతో వండిన అన్నముపై ఆసక్తి గల తల్లి అని అర్ధము.

పెసలతో వండిన అన్నాన్నే చాలామంది కట్టే పొంగలి అనుకుంటారు. దీనినే సిద్దాన్నామని కూడా అంటారు. శాస్త్ర రీత్యా ఈ సిద్దాన్నమును తొమ్మిది పదార్ధాలతో వండవలెను.

“సుశాలితండులప్రస్థం తదర్థం ముద్గభిన్నకం,
చతుఃఫలంగుడం ప్రోక్తం, తన్మానం నారికేళకమ్,
ముష్టిమాత్రం మరీచంస్యాత్ తదర్థం సైంధవం రజః,
తదర్థం జీరకం విద్యాత్ కుడవం గోఘ్రుతం విదుః,
గొక్షీరేణస్వమాత్రేణ సం యోజ్యా కమలాసనం,
మందాగ్నివచనాదేవ సిద్ధాన్నమిద ముత్తమం.||” అని శాస్త్ర రీత్యా చెప్పిన దానికి అర్థమేమిటంటే…
స్వచమైన బియ్యము తీసుకొని దానిలో సగము పెసలు లేక పొట్టు తీయని పెసరపప్పు కలిపి అందులో బెల్లం, కొబ్బరి, మిరియాలు, సైంధవలవణము, జీలకర్ర, ఆవునెయ్యి, ఆవుపాలు కలిపి తయారు చేసిన దానిని ముద్గౌదనము అంటారు. ఇదియే సిద్దాన్నము. ఇదియే పులగము. ఇదియే అసలు సిసలైన కట్టె పొంగలి. దీనిని  సాకీనీ దేవత రూపంలో ఉన్న లలితా దేవికి నివేదన చేస్తే ఆమెయే సాకినీ శక్తిగా సంతోషించి తగిన పుష్టిని, ఇష్టిని చేకూర్చును.

కనుక శరీరంలో ఉండే షట్చక్రాలలో దిగువ భాగంలో ఉండే మూలాధార చక్ర దేవత, నివేదన తెలుసుకున్నాం. అయితే ఈ మూలాధారంలో ఉండే కుండలినీ శక్తి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇదొక సర్పాకారమని పైన చెప్పుకున్నాం.

 షట్చక్రాలలో మూలాధార చక్రానికి ఆధిపత్య గ్రహం కుజుడు. స్వాదిష్టాన చక్రానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు. మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం రవి. అనాహత చక్రానికి ఆధిపత్య గ్రహం బుధుడు. విశుద్ది చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు. ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని. ఈ ఆరు చక్రాల పైన తలమానికగా ఉంటూ పాలించేది, నియంత్రించేది మరొకటి బ్రహ్మ రంధ్రంలో ఉండును. దానినే సహస్రార చక్రము అంటారు. దీని ఆధిపత్య గ్రహం చంద్రుడు. కనుక నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఈ చక్రాలకు ఆదిపత్యంగా నిలుస్తున్నాయి. ఇక మిగిలిన రాహు, కేతువులు ఎక్కడ ఉన్నారు అనే అనుమానం ఉంటుంది.

ఒకవిధంగా మూలాధార చక్రంలోని సర్పాకారంలో ఉన్న కుండలినే రాహు కేతువులుగా తీసుకోవాలి. తల భాగాన్ని రాహువని, తోక భాగాన్ని కేతువని పిలుస్తారు. శనివత్ రాహు, కుజవత్ కేతుః అని శాస్త్ర వచనం. అనగా శని రాహువుతో సమానమని, కుజుడు కేతువుతో సమానమని అర్థము. అందుకే తల భాగంగా ఉన్న ఆజ్ఞా చక్రానికి ఆధిపత్య గ్రహం శని కాగా, అదోభాగానున్న మూలాధారానికి కుజుడు కావటం గమనార్హం.

కాబట్టి నవగ్రహ ఆధిపత్యాలన్ని మన శరీరంలోనే ఉన్నాయి. ఇక మానవాళికి సమస్యలుంటుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. ఈ రెండింటికీ ప్రధాన కేంద్ర బిందువులు రాహు, కేతువులే అన్న నగ్న సత్యం నూటికి 90 మందికి తెలియదు. కనుక ఈ రాహు, కేతువులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తృప్తి కల్గించటానికి ఎన్నెనో పద్ధతులున్నాయి. ఈ పద్దతులలో తాంత్రిక మార్గంలో ఆచరించేది గోధుమపిండి దీపారాధన. ఈ 2016లో గురు చండాలయోగం అనేది త్వరలో రానున్నది. అంటే శుభ గ్రహమైన గురువు రాహువుతో కలవబోతున్నాడన్నమాట.

కనుక కేవలం గురు చండాల యోగానికి మాత్రమే కాకుండా మానవాళి శ్రేయస్సుకై ఆచరించే తాంత్రికారాధన గోధుమ పిండి దీపారాధన. పెద్దగా ఖర్చుతో కూడినది కాదు. అలాగే వైదిక మార్గంలో గురుచండాలయోగానికి కూడా హోమ సహిత విశేష క్రతువులు ఉన్నాయి. వాటిని కూడా తెలియచేస్తాను.

ఈ పరంపరలో గోధుమ పిండి దీపారాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి,  ఏ నివేదన ఇవ్వాలి అనే ముఖ్య అంశాలతో రాబోయే పోస్టింగ్ ఉండును. వైదిక మార్గ విధి విధానాలను కూడా తెలుసుకోవటానికి ప్రారంభం చేద్దాం.  – శ్రీనివాస గార్గేయ

August 3, 2022 5 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

మానవ శరీరమే ఒక శ్రీచక్రము – గోధుమపిండి దీపారాధన 3

by gargeyaastro August 3, 2022
written by gargeyaastro

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం కలాం భిభ్రతీం
సౌవర్ణామ్బర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం
త్వాంగౌరీం  త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీమ్

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రసంచారినీ అని పై శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ప్రపంచంలో ఏ వస్తువు గాని, ఏ శక్తి గాని, ఏ జీవి గాని, ఏదైనా సరే ఆదిపరాశక్తి యొక్క సృష్టియే. మనకంటూ ఏమి లేనివారిమి. మనదంటూ ఏది కానివారిమి. మనసా వాచా కర్మణ్యా ఆ భగవతిని ఆరాధించి ఇహ పరాలకు రెండింటికి దగ్గరై, రెండింటిని పొందటమే మానవులుగా మనం చేయవలసింది. ఇహంలో కూడా పరాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లేకపోతే పరానికి చెడిపోయి కేవలం ఇహమే మిగులుతుంది. అట్టి పర హీనమైన ఇహం వ్యర్ధం. ఎందుకంటే పరమనేది శాశ్వతమైనది. ఇహమనేది తాత్కాలికం.

పరానికి ప్రయత్నం భక్తి ద్వారా చేస్తూ ఇహాన్ని అనుభవించటంలో తప్పు లేదు. పరాన్ని పోగొట్టుకోకుండా ఇహ లోకంలో జీవితం అనుభవిస్తూ భక్తి ద్వారా ఆది పరాశక్తిలో ఐక్యత చెందటమే మానవ జన్మ ముఖ్య లక్షణం. అది సాధించటానికి శ్రీచక్రమంతటి గొప్ప ఉపకరణం మరొకటి లేనే లేదు. మూడత్వం, అజ్ఞానం భక్తిని కలుగచేయవు. వాటిని దూరంగా ఉంచాలి. భక్తితో ఆరాధించేవారికి నియమాలు, కట్టుబాట్లు అవసరం లేదు. మనసుతో ప్రధానంగా ఆరాధిస్తే ఏ నియమాలు పాటించనవసరం లేదు. నిర్మలమైన నిర్వికారమైన భక్తి కావాలి. అదే శ్రీమాత కోరుకునేది. సంకోచ, వ్యాకోచాలు, అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు.

ప్రతి దేవతకి మంత్రం, యంత్రం, పూజ ఉంటాయి. మనం దేవతను ఒక రూపంగా భావించి అనేక ఉపచారాలతో కొలుస్తాం. అదే దేవతను రేఖా రూపంగా యంత్రంలో ఉంచి కూడా పూజిస్తాం. రూపం ఉన్న దేవతని అర్చించటం కంటే రేఖా రూపంగా యంత్ర రూపంలో ఉన్న అదే దేవతను అర్చించటం కంటే… మరో శక్తి వంతమైన రూపంలో దేవతను ప్రార్ధించే విధానాన్ని తంత్రం అంటారు. పరోక్షంగా చెప్పాలంటే మానసికమైన సూక్ష్మ రూపంతో ఉన్న దేవతోపాసనను లేక పూజను తంత్రం అంటారు.

ఈ తంత్రాలని శివ, దేవి, విష్ణు సంబంధాన్ని బట్టి విభజిస్తారు. శివాంశ సంబంధిత తంత్రాలను శైవ తంత్రాలని, దేవి తంత్రాలను శక్తి తంత్రాలని, విష్ణు సంబంధితములను వైష్ణవ తంత్రాలని చెబుతారు. శివ తంత్రాలు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అనే మూడింటిని చెబుతున్నాయి. దేవి తంత్రాలు మాత్రం అద్వైతములు మాత్రమే చెప్తాయి. వైష్ణవ తంత్రాలు ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని వివరిస్తాయి. శ్రీ కృష్ణుడు శివ తత్వాలను తాంత్రిక రూపంలో ఉపాసన చేసినట్లుగా  మహాభారతంలోని శాంతి పర్వం తెలియచేస్తుంది.

తంత్ర శాస్త్రంలో శక్తులకు గుర్తుగా రేఖా చిత్రాలని ఉపయోగిస్తారు. వాటిని యంత్రములు అంటారు. యంత్రాలన్నింటిలోను శ్రీచక్రం అత్యున్నతమైనది. ఇది శ్రీచక్రంలో ఒకదానిలో ఒకటి ఇమిడిన త్రికోణాలున్నాయి. కేంద్రములో బిందువున్నది. తొమ్మిది త్రికోణములు ఒక వృత్తంలో ఉంటాయి. ఈ తొమ్మిదింటిలో ఐదు త్రికోణాలు దిగువ వైపుకు నాలుగు త్రికోణాలు ఎగువవైపుకు ఉంటాయి. దిగువ వైపుకు అనగా అధోముఖంగా ఉండే ఐదింటిని శక్తి కోణాలని, ఊర్ధ్వ ముఖంగా ఉండే నాల్గింటిని శివ కోణాలని అంటారు.

శ్రీచక్రం యొక్క సాధారణ అవగాహన లేనిదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని కొన్నింటిని పూర్ణంగా తెలుసుకొనలేము. విశ్వచక్రమే శ్రీచక్రము. అలాగే మన శరీరమే ఒక శ్రీచక్రంగా చెప్పబడుతున్నది. శ్రీదేవి శ్రీచక్రంలోనే ఉంటుంది గనుక, మన హృదయంలో దర్శనం చేయటం మొదలు పెడితే మనలోనే శ్రీచక్రం సాక్షాత్కరిస్తుంది. అంటే శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారిస్తారన్నమాట. శ్రీచక్రాన్ని యంత్రమని  పిలుస్తాం.

భారతీయ విగ్రహారాధనలో, విగ్రహం యంత్రంతో సంబంధం కలిగి ఉంటుందని తెలుసుకోవాలి. “అరుణాం కరుణాతరంగితాక్షీం” అని అమ్మవారిని చేసిన ధ్యానానికి శ్రీచక్రానికి సంబంధం ఉంది. అంతా శ్రీచక్రాకృతి. అందుచేతనే ధ్యాన శ్లోకాలలో ఈ శ్లోకానికి మరింత ప్రాధాన్యం ఇవ్వబడింది. శ్రీచక్రం 9 ఆవరణలతో కూడి ఉన్నది. ఆవరణ అనగా ఆకృతి అని అర్ధం. “అణిమాదిభిరావృతంమయూఖై: ” ఈ ఆవరణలన్నీ వెలుగైతే, ఆ ఆవరణల మధ్య ఉన్న జ్యోతి వంటిది అమ్మవారు. ఆ జ్యోతియే బిందువు. ఆ బిందువు వద్ద భాసిస్తున్న తల్లియైన జగదాంబిక “అరుణాం కరుణాతరంగితాక్షీం” అని వర్ణించబడింది.

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

ఒకేసారి ఒకే  వ్యాసంతోనే గోధుమపిండి దీపారాధన ప్రతి ఆదివారం చేయండి అని ఒక్క ముక్కలో చెప్పవచ్చును. కాని ఇలా ఎందుకు చేయాలి అని సవివరంగా చెప్పటానికై, పాఠకులకు పరిపూర్ణమైన అవగాహన మరింత మెరుగుగా ఉండాలనే ఆలోచన తోటే  ఇంత సుదీర్ఘ వ్యాసాన్ని అందిస్తున్నాను. మరో రెండు వ్యాసాలతో గోధుమపిండి దీపారాధన పూర్తి వివరాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. – శ్రీనివాస గార్గేయ

August 3, 2022 5 comments
0 FacebookTwitterPinterestEmail
Blogs

రాహు కేతు యోగాలు, గోధుమపిండి దీపారాధన 2

by gargeyaastro August 3, 2022
written by gargeyaastro

నవగ్రహాలలో ఏడు గ్రహాలు పూర్తి స్థాయిలో జాతకునకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు, కేతువులు అనుకూలంగా లేకపోతే… ఆ జాతకునకు పరిస్థితులు దగ్గరకు వస్తూనే ఉంటాయి… కాని ఆనుభవించలేడు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతుంటారు. కాబోయే మంత్రిగారు అనే ప్రచారం కూడా బాగా సాగుతుంది. కాని రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో కాబోయే మంత్రి గారి పేరు గల్లంతవుతుంది.

చూశారా ఇలాంటి స్వల్ప అవయోగాలవలెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.

సప్త గ్రహాలూ అనుకూలించకపోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరించి… ఏక్ దిన్ కా సుల్తానా లాగా పదవిని అలంకరిస్తారు.  ఇలాంటి వారు ఆ సప్త గ్రహాలను తగిన రీతిలో అనుకూలించేలా తగు తగు పరిహారములు చేసుకుంటే ఈ పదవి పది కాలాలపాటు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే… రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా  అంత్య క్రియలు జరగటం కూడా ఈ చాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి.

కనుక ప్రతివారు సప్త గ్రహాలు యోగాలను ఇచ్చిననూ, ఇవ్వకపోయినను, రాహు కేతువుల యొక్క రాజయోగాన్ని సంపాదించటానికి కృషి చేస్తూ, ఈ యోగాన్ని శాశ్వత ప్రాతిపదికగా నిలుపుకోనేలా కూడా ప్రయత్నాలు చేయటానికి అనేక తాంత్రిక మార్గాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

అష్ట దిక్పాలకులలో ఉత్తరపు దిక్కునకు అధిపతిగా ఉండే దేవత పేరే కుబేరుడు. నవ గ్రహాలలో రాహు కేతువులను ఛాయా గ్రహాలుగా పేర్కొంటారు. రాహువు ఉత్తర ధృవమునకు అధిపతిగా ఉండే ఓ బిందువు. అలాగే కేతువు కూడా దక్షిణ ధృవానికి అధిపతిగా ఉన్న ఓ బిందువుగా పరిగణించాలి. జ్యోతిష శాస్త్ర రీత్యా రాహు, కేతువులు ఓ సర్పాకారంగా ఉంటారని రాహువు తల భాగంగాను, కేతువు తోకభాగంగాను ఉండును. ఈ రెండు గ్రహాలూ ఖగోళంలో అపసవ్యంగానే తిరుగుతుంటాయి. మిగిలిన ఏడు గ్రహాలూ గడియారంలో ముళ్ళులాగా సవ్యదిశలో తిరుగుతుంటారు.

రాహువు, కేతువుల మధ్యలో సవ్యంగా తిరిగే ఏడూ గ్రహాలూ ఉన్నప్పుడు, దానిని కాలసర్పయోగము అంటారు. కాని ప్రస్తుత రోజులలో ఈ విషయాన్ని అనేకమంది మర్చిపోయి కాలసర్ప దోషంగా చిత్రీకరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. ఉదాహరణకు కన్యా రాశిలో రాహువున్నాడు. మీనరాశిలో కేతువున్నాడు. మిగిలిన ఏడూ గ్రహాలూ ఈ రెండు గ్రహాల మధ్యనే ఉండాలన్నమాట. ఉదాహరణకు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కేతువున్నాడు. రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. అనేకమంది పండితులు ఈ కేతువు చంద్రుడు ఉన్న స్థానాలను గమనించక… మీకు కాలసర్ప దోషం పట్టింది, సమస్యలు వెంటాడతాయి అని భయపెట్టి… పబ్బం గడుపుకుంటుంటారు. వాస్తవానికి ఉత్తరాభాద్ర నక్షత్రం తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. గ్రహాలలో కేతువు తర్వాత ఇంకెవరూ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే అది కాలసర్పయోగమవుతుంది. పైన చెప్పిన ఉదాహరణకు కాలసర్పయోగం పట్టదు. అలా కాకుండా ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉండి, రేవతిలో కేతువుంటే కాలసర్పయోగం పడుతుంది. అనగా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు.. వాటి వాటి ముందు వెనుకలను తెలుసుకోకుండానే భయపెడుతుంటారు.

కాలసర్పయోగం ఉన్నవారు తారాస్థాయిలో ఎంతోమంది ఉన్నారు. అబ్రహం లింకన్, జార్జ్ బుష్, ధీరుభాయ్ అంబాని… మహేశ్ యోగి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మెగాస్టార్ చిరంజీవి ఇలా ఎందరెందరో ఉన్నారు. కాలసర్పయోగం ఉన్నవారు ఒక రంగంలోనే ఉండాలి తప్ప రెండవ రంగానికి వెళ్ళకూడదు. కీర్తిశేషులు అంబాని వ్యాపార రంగంలోనే ఉన్నారు తప్ప రాజకీయ రంగంలోకి ప్రవేశించలేదు. అలాగే చిరంజీవి సినిమా రంగం కాకుండా రాజకీయ రంగం మీదకి వెళ్ళాడు. అందుకే ఈ రంగం ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కనుక కాలసర్ప దోషమనేది లేదు. కాలసర్పయోగమనేది ఉన్నది. పైగా పురాతన జ్యోతిష గ్రందాల సారాంశం ప్రకారం కాలసర్ప యోగం ప్రభావం వ్యక్తులకంటే కూడా సరిహద్దు ప్రాంతాలపైనే ప్రభావం ఉంటుందని స్పష్టమైనది. ఇక అసలు విషయంలోకి ప్రవేశిద్దాం.

రాహువు ప్రతిరోజు 90 నిముషాల పాటు రాహుకాలంగా ఒక్కో వారంలో ఉంటుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే 12 గంటల సమయంలో… సోమవారం రాహుకాలం ఏడున్నర గంటలకు, శనివారం 9గంటలకు, శుక్రవారం 10.30గంటలకు, బుధవారం 12 గంటలకు, గురువారం 1.30 నిముషాలకు, మంగళవారం 3 గంటలకు, ఆదివారం 4.30 గంటలకు ప్రారంభాలు జరుగుతుంటాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు ఏ వారానికి కూడా రాహుకాలం ఉండదు. కనుక ఈ 90 నిముషాల వ్యవధిలో మనం రాహువు యొక్క పరోక్ష యోగాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి.

మరి ఉన్న ఏడు రోజులలో ఏరోజున ఈ సమయాన్ని తీసుకోవాలి అనే అనుమానం ఉంటుంది కొందరికి. గ్రహ రాజు సూర్యుడు, సూర్యుని యొక్క వారమే ఆదివారం. కనుక సూర్య కుటుంబంలోనే ఈ గ్రహాలు సంచారం చేస్తుంటాయి. కనుక ప్రతి ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 7.30 గంటల లోపలనే గోధుమపిండి దీపారాధన  ఆచరించాలి. అసలు ఈ గోధుమ పిండితో ఎందుకు చేయాలి ? చేశామనుకుందాం. ఎందుకు ఆ వెలుగును చూడాలి ? వెలుగును చూసినంత మాత్రాన లబ్ది  వస్తుందా ? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ప్రతివారికి ఉదయిస్తుంటాయి.

కనుకనే అలాంటి ప్రశ్నలు ఉదయించకుండా ఉండటానికే సుదీర్ఘమైన వ్యాసాలను అందిస్తున్నాను. కనుక రేపు వచ్చే ఆదివారమే దీపారాధన చేయాలని కాదండి. ప్రతి ఆదివారం దీపారాధన చేస్తూనే ఉందాం. వెలుగును చూస్తూనే ఉందాం. రాహు యోగాన్ని పొందుతూనే ఉందాం. అసలైన ఆసక్తికర వివరాల కోసం పోస్టింగ్ కాబోయే మూడవ వ్యాసంలోకి వెళదాం. విలువైన ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రాదులకు పంపండి. – శ్రీనివాస గార్గేయ

August 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Blogs

నిజమైన ఆధ్యాత్మికత – గోధుమపిండి దీపారాధన 1

by gargeyaastro August 3, 2022
written by gargeyaastro

ప్రస్తుత రోజులలో ఆధ్యాత్మికత పేరు చెప్పుకొని జరిగే మోసాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన అర్ధం దిగజారిపోతున్నది. ఆధ్యాత్మికత అనగానే వస్త్ర ధారణ మార్చి గడ్డాలు పెంచటము లేక కనులు మూసి శూన్యంలోకి చూడటము లేదా రుద్రాక్షలు ధరించి నాలుగు సూక్తులు వల్లించటము అనుకుంటున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే మన ఆలోచనలలో స్వచ్చత తీసుకురావటము. మనకున్న సంస్కారాలు, వాసనలు తొలగించుకోవటం, ఆత్మను శుద్ధి చేసుకొనటమే. దేవుడు కోర్కెలు తీర్చే యంత్రము కాదు, మంత్రము కాదు. చెడు ఖర్మకు చెడు ఫలితం, మంచి ఖర్మకు మంచి ఫలితం ఉంటుంది. ఈ ధర్మం సృష్టి అంతటా ఒకేలా ఉంటుంది.

భగవంతుడు సృష్టించిన పూలు, పండ్లు, కొబ్బరికాయలను భగవంతుడికే సమర్పిస్తూ కోరికలను తీర్చమని అడగటం భావ్యం కాదు. దైవత్వం అనేది నిజం. సృష్టి అంతటా దేవుడే ఉన్నాడు. దేవుడితో సంభాషించాల్సింది హృదయమే కాని కంఠమ్ కాదు. హృదయాంతరాలల్లో భావన లేకుండా కేవలం శబ్దాలతో స్తుతిస్తే ఏం ప్రయోజనం. భాష, శబ్ద ప్రాధాన్యం కంటే భావ ప్రాధాన్యం అతి ముఖ్యం. నిర్మలమైన మనస్సుతో హృదయంలో స్వచ్చత సాదుగుణం పెంపొందించాలి. ఆధ్యాత్మికత అంటే మన అంతరాత్మ ఉనికి తెలియచేసే ఓ అపూర్వమైన జ్ఞాన ప్రక్రియ. ఏది సాధించాలన్నా ఈ శరీరం ద్వారానే సాధ్యపడుతుంది.

తన దైనందిన జీవితంలో ఎలాంటి ముసుగులు, నటనలు లేకుండా స్వచ్చతతో మనిషి ప్రాపంచిక జీవితాన్ని గడిపినప్పుడే ఆధ్యాత్మిక జీవనానికి గట్టి పునాది అవుతుంది. ఆధ్యాత్మిక జీవితం మన ప్రాపంచిక జీవనానికి ఒక ఆభరణంలాంటిదే కానీ అవరోధం మాత్రం ఎన్నటికీ కాదు. ఆధ్యాత్మిక దృష్టితో ప్రాపంచిక జీవనాన్ని గడపటం పరమానందానికి సోపానం. ఈ రెండు జీవితాలు ఒక నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. వీటి మధ్య తేడా ఏమి ఉండదు.  సంసారాన్ని వదిలేసి ఎక్కడికో పారిపోవటం కాదు. హిమాలయాలకి వెళితే అక్కడ లభించే ప్రశాంతత హిమాలయాలదే కానీ, మన హృదయానిది కాదు. మన హృదయంలో నెలకొల్పే నిర్మలమైన మనో నిశ్చలతే అసలైన ఆధ్యాత్మికత.

ఈ మనస్సనేది ప్రతి వ్యక్తికి మెదడులో ఉండే సహస్రారంలో ఉంటుంది. దీనికి అధిపతి చంద్రుడు. శరీరంలోని అన్నీ ప్రక్రియలను నిర్దేశించేదే సహస్రార చక్రం. మన శరీరంలోని అన్ని చక్రాలలోను తలమానికగా నిలిచి, అన్నింటిని పాలించి నియంత్రించేది ఈ చక్రమే. కేంద్ర నాడీమండలంతో అనుసంధానించబడి ఉండును. మానసిక ఆనందానికి సంతోషానికి, ఉల్లాసానికి శక్తివంతమైన ఆలోచనలకు సత్యానికి, ఏకాగ్రతకు కేంద్రమే కాకుండా… అనవసరమైన ఉపయోగంలేనటువంటి వ్యర్ధ భావాజాలానికి ప్రేరణ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇది మనసును గురించి చెప్పే రెండు మాటలు.

శరీరంలోని షట్చక్రాలలో హృదయ కుహరంలో ఉండే చక్రమే అనాహత చక్రం. ఈ చక్రానికి అధిపతి బుధుడు. ఈ చక్రం ద్వారా హృదయాన్ని, ఊపిరితిత్తులను, రక్తాన్ని, రక్తసరఫరాను చేస్తూ, ఊపిరితిత్తులు సాగి ముడుచుకునే గుణాన్ని, ఉచ్చ్వాస, నిశ్వాసాలను నిర్దేశిస్తూ
వ్యక్తికి భావనలను అందించే కేంద్రంగా ఉంటుంది. అన్ని చక్రాలకన్నా అతి సున్నితమైనది. మనస్సనే చంద్రగ్రహ పరిధిలో హృదయాదిపతైన బుధుడు పని చేస్తుంటాడు. ఈ చంద్రుడు, బుధుడు రెండింటి ద్వారానే వ్యక్తి జీవనంలో ఎదుగుదలలు, తగ్గుదలలు ఉంటాయి. అందుకే అధర్వణ వేదంలో ఉన్న మూడు ఉపనిషత్తులలో మొదటిదైన ప్రశ్నోపనిషత్తులోని శాంతి పాఠంలో ఏమి చెప్పబడిందంటే  దేవతలని, సూర్యుడిని, బృహస్పతిని ప్రార్ధిస్తూ చక్కని బుద్ది అనుగ్రహించాలని ఈ జీవితం తరించటానికి ఆయువు ఉన్నంతవరకు ఇబ్బందులు లేకుండా మనసు చెదరకుండా, సాధన సక్రమంగా కొనసాగించుకొనే అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్ధన. ఈ శాంతి మంత్రంలో “పశ్యేమ దేవహితం యదాయు:” అని ఉంటుంది. దేవతలకు హితంగా జీవించాలనుకుంటున్నామని భావం.

ముఖ్యంగా కళ్ళు, చెవులు చాలా బలవంతమైనవి. ఒక ఘోర దృశ్యం కంటపడటమో లేక వినరానివి విన్నప్పుడు, మన ఏకాగ్రతను చెదరగొట్టి మనసుని వికలం చేస్తుంది. మనసు సరిగా లేకపోతే బుద్ది ఎలా పని చేస్తుంది. అందుకే ఆ శాంతి మంత్రంలో భద్రం పశ్యేమ, భద్రం శృణుయామ దేవతలారా… సాధనా కాలంలో మంచి దృశ్యాలతో, మంచి శబ్దాలతో మమ్ములను అనుగ్రహించండి. ఓ బృహస్పతి మాకు సహకరించండి…. అంటూ ప్రార్ధన ఉంటుంది.

అసలు ఈ బృహస్పతే (గురువు) మన ప్రార్ధనను వినే స్థితిలో లేక సమస్యలతో ఉన్నప్పుడు, మన సాధన స్థితి ఎట్లా? ఈ విషయంలోనే పాఠకులు బాగా ఆకళింపు చేసుకుంటూ ముందుకు నడవవలసిన అనేక అంశాలు ముందున్నాయి. కనుకనే గోధుమ పిండి దీపారాధనతో తొలుత ప్రారంభం చేసి, సరైన ఆధ్యాత్మికతకు దగ్గరవటము, మరికొంత తాంత్రిక, వైదిక మార్గాలలో ఉన్న అంశాలను తెలుసుకుంటూ మనసును, బుద్ధిని కట్టడి చేస్తూ రాహు ప్రభావాన్ని సరియైన రీతిలో అనుకూలంగా మరల్చుకుంటూ గురు చందాల యోగ ప్రభావాన్ని దూరం చేసుకోటానికి… మనమేసే అడుగులు ఎన్నో ఉన్నాయి. ఆ అడుగులలో మొదటిది గోధుమ పిండి దీపారాధానతో వ్యక్తీకరించబడే ఆధ్యాత్మిక భావనను ముందు తెలుసుకుందాం. ఈ విషయాలను అర్ధమయ్యే రీతిలో చెప్పటానికే పై విధమైన సోదాహరణ వ్యాసం అవసరమైనది. – శ్రీనివాస గార్గేయ

August 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • Regarding panchangam
  • Panchangam from 2026 MAY 28-APRIL 01
  • Panchangam from 2026 MAY 23-27
  • Panchangam from 2026 MAY 18 – 22
  • Panchangam from 2026 MAY 13-17

Recent Comments

Archives

  • July 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • April 2024
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • March 2023
  • October 2022
  • August 2022
  • February 2022

Categories

  • Articles
  • Astrology
  • Blogs
  • Latest
  • Nitya Panchangam
  • Technology
  • Videos

Latest Posts Scrolling

  • Latest Technology

    Regarding panchangam

    July 15, 2026
  • Panchangam from 2026 MAY 28-APRIL 01
    Astrology Latest Nitya Panchangam

    Panchangam from 2026 MAY 28-APRIL 01

    May 18, 2026
  • Panchangam from 2026 MAY 23-27
    Astrology Latest Nitya Panchangam

    Panchangam from 2026 MAY 23-27

    May 18, 2026
  • Panchangam from 2026 MAY 18 – 22
    Astrology Latest Nitya Panchangam

    Panchangam from 2026 MAY 18 – 22

    May 18, 2026
  • Panchangam from 2026 MAY 13-17
    Astrology Latest Nitya Panchangam

    Panchangam from 2026 MAY 13-17

    May 18, 2026
{"speed":"500","height":"400","pause":"2000"}
  • About
  • Contact Us
  • Our Services
  • Blog
  • Nitya Panchangam
  • Photo Gallery
  • YouTube
  • Store

Copyright © 2024 Gargeya Astro | All Rights Reserved.

Gargeya Astro
  • Home
  • About
  • Our Services
  • Nitya Panchangam
  • Blog
  • Gallery
  • Store
    • Kalayogam Prime
    • Kalayogam Mini
    • 2022 Calendars
  • Youtube
  • Contact Us