Home Blogs మహాసౌరయోగాలు – పరిహారాలు 2వ భాగం

మహాసౌరయోగాలు – పరిహారాలు 2వ భాగం

by gargeyaastro

భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారంగా వైదికంగా పంచాయతన పూజను నిర్వహిస్తుంటారు.
ఆదిత్యామంబికా విష్ణుం గణనాధం మహేశ్వరం
పంచయజ్ఞో కరోన్నిత్యం గృహస్తః పంచ పూజయతే||

ఈ పంచాయతనంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం అనునవి ఐదు ప్రధాన అంశాలు. వైష్ణవంతో మహావిష్ణువును, శైవంతో పరమ శివుడిని, గాణాపత్యంతో గణపతిని, శాక్తేయంతో అమ్మవారిని, సౌరంతో సూర్య భగవానుడిని ప్రార్ధించి పూజించే విధానాన్నే పంచాయతనం అంటారు. ఈ పరంపరలో జగద్రక్షకుడైన సూర్య భగవానుని అనుగ్రహ ప్రాప్తికై మరికొన్ని ముఖ్య పర్వదినాలు కూడా భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి.

ప్రతినెలా సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించే రోజును సంక్రమణం లేక సంక్రాంతి అంటారు. మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా పిలుస్తూ సూర్య భగవానుని ప్రార్ధిస్తూ, పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తారు. అలాగే మాఘ శుక్ల సప్తమి రోజున (రధసప్తమి) సూర్య జయంతిగా ఆరాధన  జరుగును. వీటితో పాటు సప్తమి తిధి ఆదివారాలలో వస్తే భానుసప్తమిగా,  కృత్తికా నక్షత్రం ఆదివారాలలో వస్తే భాను కృత్తికగా సూర్య భగవానునికి పూజాధికాలు చేస్తుంటాం.

జాతక  లోపాలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో సూర్య నమస్కారాలు, అలాగే అరుణ పారాయణాలు చేయటం, ఆదిత్య హృదయ పఠనము కూడా సర్వ సాధారణంగా జరుగుతుంది. వాస్తవానికి  చెప్పాలంటే సూర్య నమస్కారాలు ఎవరైతే ఆచరిస్తారో, వారికి మాత్రమే ఫలితం ఉంటుంది గాని, మనము చేయలేక మరొకరి చేత సూర్య నమస్కారాలు చేయిస్తే ఫలితముండదు. వైదిక క్రియలలో అనేక పద్ధతులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.  ఇవి అందరికీ తెలిసినటువంటివి. ఇవి కాకుండా ప్రతి నెలలో కూడా మహా సౌరయోగాలు అంటూ ఉంటుంటాయి. ఈ యోగ దినాలలో కూడా సూర్య భగవానుడిని ప్రార్ధిస్తే ప్రారబ్ధ కర్మల ద్వారా వచ్చే వ్యతిరేక ఫలితాలు  కొంతమేర  తగ్గుముఖం పట్టునని పురాతన గ్రంధాలు చెప్తున్నాయి.

ఇంతకీ మహా సౌరయాగం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు ఏ నక్షత్రంలో సంచారముండునో, ఆ నక్షత్రానికి 4,6,9,10,13,20  నక్షత్రాలలో చంద్రుడు కనుక సంచారంలో ఉంటే ఆ సమయాన్ని మహా సౌర యోగం అంటారు. ఈ సమయం ఒక్కోసారి రాత్రి, పగలు కూడా ఉంటుంది. రాత్రి సమయంలో సూర్య భగవానుని దర్శనం ఉండదు కనుక, దర్శనం ఇచ్చే పగటి సమయంలో తొలి 10 ఘడియలలోనే విధి విధానమును ఆచరించాలి. మొదటి 5 ఘడియలలో ఆచరించటం ఉత్తమోత్తమం. తదుపరి 3 ఘడియలు ఆచరించటం ఉత్తమం. చివరి రెండు ఘడియలలో ఆచరించటమనేది మధ్యమం. ఒక ఘడియ అనగా 24 నిముషాలు. 5 ఘడియలు అంటే రెండు గంటలన్నమాట.

దీనిని బట్టి సూర్యోదయం తర్వాత తొలి 2 గంటలు విశేష ప్రాధాన్యతతో ఉండును. వైద్య శాస్త్ర ప్రకారం కూడా తొలి రెండు గంటలలోనే సూర్య కిరణాలు ప్రసరించేలా సూర్య కాంతిలో నిలబడితే చక్కని ఆరోగ్యం ఉండునని, శరీరానికి డి విటమిన్ లభించునని వైద్య శాస్త్రం పేర్కొంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం ద్వారా తొలి రెండు గంటలలో పరిహారమును పాటించినట్లయితే చక్కని అనుకూలతలు పరోక్షంగా కల్గును. ఈ సౌరయోగాలు ప్రతి నెలలో 5 నుంచి 8 వరకు వస్తుంటాయి. ఆ వచ్చే దినాలను సరియైన పంచాంగం ద్వారా తెలుసుకుని పరిహారమును పాటించాలి.

ఈ పరిహారమును పాటించటానికి ముఖ్యముగా కావలసినవి గోధుమపిండి, మంచి కొబ్బరి నూనె, నీరు. గోధుమపిండి అనగానే మార్కెట్లో సిద్ధంగా ఉండే పిండిని తీసుకోవద్దు. ఎవరిపాటికి వారు ఒక కేజీ గోధుమలను తీసుకొని వాటిని పిండి చేయించేది. ఎట్టి పరిస్థితులలోను జల్లించవద్దు. అనగా పిండిలో పొట్టు కలిసి ఉండాలన్నమాట. ఈ సౌరయాగం వచ్చిన రోజులలో షుమారు 50 గ్రాముల పిండిని తీసుకుని అందులో 4,5 చెంచాలు కొబ్బరి నూనెను వేసి.. మరికొద్దిగా నీటిని వేస్తూ ముద్దగా కలపాలి. చిన్న చిన్న రొట్టెలుగా గుండ్రంగా ఉండేలా వత్తుకుని పెనముపై ఏ ఇతర నూనె లేకుండా రొట్టెలుగా కాల్చుకొనేది. ఈ పిండిలో ఉప్పు ఎలాంటి పరిస్థితులలో వేయవద్దు.

ఇలా తయారైన రొట్టెలను ఒక పళ్ళెరములో ఉంచుకొని సౌరయోగం జరిగే రోజున తొలి రెండు గంటలలో సూర్య కాంతి సోకేలా ఓ 5 నిముషాల పాటు పళ్ళెరమును సూర్య కాంతిలో ఉంచేది. పళ్ళెరమును చేతిలోనే పట్టుకొని ఉండవలసిన అవసరం లేదు. తదుపరి ఆయా రొట్టెలను కుటుంబంలో ఉన్నవారు మహా సౌర ప్రసాదంగా భావించి స్వీకరించేది. ఎట్టి పరిస్థితులలో ఆయా రొట్టెలను మిగల్చకుండా కుటుంబ వ్యక్తులే స్వీకరించాలి. చెత్తకుప్పలలో వేయవద్దు.

ప్రతి నెలలో వచ్చే మహాసౌర యోగ రోజులలో పై విధి విధానంగా ఆచరించినచో ప్రారబ్ద దుష్కర్మల ఫలితాలు తగ్గుటకు అవకాశం వచ్చును. ఈ మహాసౌర యోగాలలో జరిగే రోజులలో ఒక్కో నక్షత్రం వస్తుంటుంది. ఆ నక్షత్రం ఎవరిదైనా జన్మ నక్షత్రమైనచో, ఆ రోజును విశేష శుభప్రద మహా సౌరయోగంగా స్వీకరించండి. అలాగే మహా సౌరయోగాలు వచ్చే రోజులలో ఆదివారాలు కలిసి వఛ్చిననూ విశేషంగా భావించాలి.

కృత్తికా, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలతో కూడిన మహాసౌరయాగం ఉన్నటువంటి రోజులలో, తయారు చేసిన గోధుమ రొట్టెల దిగువన చిక్కుడు ఆకులను ఉంచి మరికొంత అధిక సమయం పాటు సూర్య కాంతిలో ఉంచటానికి ప్రయత్నం చేయండి. పై ప్రకారంగా వయస్సుతో నిమిత్తం లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకు స్త్రీ, పురుషులెవరైననూ ఆచరించవచ్చు. స్త్రీలలో రుతుక్రమ అయిన 5వ రోజు తదుపరి మాత్రమే అర్హులు. గర్భవతులకు నియమమేమి లేదు.  జాతాశౌచ, మృతాశౌచ దినాలలో ఆచరించవద్దు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చిన రోజులలో సౌర యోగం వచ్చినచో అది నిష్ఫలముగానే భావించి, పై విధి విధానమును ఆచరించవద్దు.

– దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

You may also like

2 comments

Avatar
కల్లూరి శ్రీసూర్య prabhavathi October 28, 2022 - 2:56 pm

Pl send ur valuable information

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 11:06 am

subham

Reply

Leave a Reply to gargeyaastro Cancel Reply