Home Blogs మానవ శరీరమే ఒక శ్రీచక్రము – గోధుమపిండి దీపారాధన 3

మానవ శరీరమే ఒక శ్రీచక్రము – గోధుమపిండి దీపారాధన 3

by gargeyaastro

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం కలాం భిభ్రతీం
సౌవర్ణామ్బర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం
త్వాంగౌరీం  త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీమ్

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రసంచారినీ అని పై శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ప్రపంచంలో ఏ వస్తువు గాని, ఏ శక్తి గాని, ఏ జీవి గాని, ఏదైనా సరే ఆదిపరాశక్తి యొక్క సృష్టియే. మనకంటూ ఏమి లేనివారిమి. మనదంటూ ఏది కానివారిమి. మనసా వాచా కర్మణ్యా ఆ భగవతిని ఆరాధించి ఇహ పరాలకు రెండింటికి దగ్గరై, రెండింటిని పొందటమే మానవులుగా మనం చేయవలసింది. ఇహంలో కూడా పరాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లేకపోతే పరానికి చెడిపోయి కేవలం ఇహమే మిగులుతుంది. అట్టి పర హీనమైన ఇహం వ్యర్ధం. ఎందుకంటే పరమనేది శాశ్వతమైనది. ఇహమనేది తాత్కాలికం.

పరానికి ప్రయత్నం భక్తి ద్వారా చేస్తూ ఇహాన్ని అనుభవించటంలో తప్పు లేదు. పరాన్ని పోగొట్టుకోకుండా ఇహ లోకంలో జీవితం అనుభవిస్తూ భక్తి ద్వారా ఆది పరాశక్తిలో ఐక్యత చెందటమే మానవ జన్మ ముఖ్య లక్షణం. అది సాధించటానికి శ్రీచక్రమంతటి గొప్ప ఉపకరణం మరొకటి లేనే లేదు. మూడత్వం, అజ్ఞానం భక్తిని కలుగచేయవు. వాటిని దూరంగా ఉంచాలి. భక్తితో ఆరాధించేవారికి నియమాలు, కట్టుబాట్లు అవసరం లేదు. మనసుతో ప్రధానంగా ఆరాధిస్తే ఏ నియమాలు పాటించనవసరం లేదు. నిర్మలమైన నిర్వికారమైన భక్తి కావాలి. అదే శ్రీమాత కోరుకునేది. సంకోచ, వ్యాకోచాలు, అనవసర అనుమానాలు పెట్టుకోవద్దు.

ప్రతి దేవతకి మంత్రం, యంత్రం, పూజ ఉంటాయి. మనం దేవతను ఒక రూపంగా భావించి అనేక ఉపచారాలతో కొలుస్తాం. అదే దేవతను రేఖా రూపంగా యంత్రంలో ఉంచి కూడా పూజిస్తాం. రూపం ఉన్న దేవతని అర్చించటం కంటే రేఖా రూపంగా యంత్ర రూపంలో ఉన్న అదే దేవతను అర్చించటం కంటే… మరో శక్తి వంతమైన రూపంలో దేవతను ప్రార్ధించే విధానాన్ని తంత్రం అంటారు. పరోక్షంగా చెప్పాలంటే మానసికమైన సూక్ష్మ రూపంతో ఉన్న దేవతోపాసనను లేక పూజను తంత్రం అంటారు.

ఈ తంత్రాలని శివ, దేవి, విష్ణు సంబంధాన్ని బట్టి విభజిస్తారు. శివాంశ సంబంధిత తంత్రాలను శైవ తంత్రాలని, దేవి తంత్రాలను శక్తి తంత్రాలని, విష్ణు సంబంధితములను వైష్ణవ తంత్రాలని చెబుతారు. శివ తంత్రాలు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అనే మూడింటిని చెబుతున్నాయి. దేవి తంత్రాలు మాత్రం అద్వైతములు మాత్రమే చెప్తాయి. వైష్ణవ తంత్రాలు ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని వివరిస్తాయి. శ్రీ కృష్ణుడు శివ తత్వాలను తాంత్రిక రూపంలో ఉపాసన చేసినట్లుగా  మహాభారతంలోని శాంతి పర్వం తెలియచేస్తుంది.

తంత్ర శాస్త్రంలో శక్తులకు గుర్తుగా రేఖా చిత్రాలని ఉపయోగిస్తారు. వాటిని యంత్రములు అంటారు. యంత్రాలన్నింటిలోను శ్రీచక్రం అత్యున్నతమైనది. ఇది శ్రీచక్రంలో ఒకదానిలో ఒకటి ఇమిడిన త్రికోణాలున్నాయి. కేంద్రములో బిందువున్నది. తొమ్మిది త్రికోణములు ఒక వృత్తంలో ఉంటాయి. ఈ తొమ్మిదింటిలో ఐదు త్రికోణాలు దిగువ వైపుకు నాలుగు త్రికోణాలు ఎగువవైపుకు ఉంటాయి. దిగువ వైపుకు అనగా అధోముఖంగా ఉండే ఐదింటిని శక్తి కోణాలని, ఊర్ధ్వ ముఖంగా ఉండే నాల్గింటిని శివ కోణాలని అంటారు.

శ్రీచక్రం యొక్క సాధారణ అవగాహన లేనిదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని కొన్నింటిని పూర్ణంగా తెలుసుకొనలేము. విశ్వచక్రమే శ్రీచక్రము. అలాగే మన శరీరమే ఒక శ్రీచక్రంగా చెప్పబడుతున్నది. శ్రీదేవి శ్రీచక్రంలోనే ఉంటుంది గనుక, మన హృదయంలో దర్శనం చేయటం మొదలు పెడితే మనలోనే శ్రీచక్రం సాక్షాత్కరిస్తుంది. అంటే శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారిస్తారన్నమాట. శ్రీచక్రాన్ని యంత్రమని  పిలుస్తాం.

భారతీయ విగ్రహారాధనలో, విగ్రహం యంత్రంతో సంబంధం కలిగి ఉంటుందని తెలుసుకోవాలి. “అరుణాం కరుణాతరంగితాక్షీం” అని అమ్మవారిని చేసిన ధ్యానానికి శ్రీచక్రానికి సంబంధం ఉంది. అంతా శ్రీచక్రాకృతి. అందుచేతనే ధ్యాన శ్లోకాలలో ఈ శ్లోకానికి మరింత ప్రాధాన్యం ఇవ్వబడింది. శ్రీచక్రం 9 ఆవరణలతో కూడి ఉన్నది. ఆవరణ అనగా ఆకృతి అని అర్ధం. “అణిమాదిభిరావృతంమయూఖై: ” ఈ ఆవరణలన్నీ వెలుగైతే, ఆ ఆవరణల మధ్య ఉన్న జ్యోతి వంటిది అమ్మవారు. ఆ జ్యోతియే బిందువు. ఆ బిందువు వద్ద భాసిస్తున్న తల్లియైన జగదాంబిక “అరుణాం కరుణాతరంగితాక్షీం” అని వర్ణించబడింది.

తల్లియొక్క వెలుగులతో ఈ విశ్వ చక్రమంతా నిండి ఉంది. ఆ శ్రీచక్రమే మన శరీరంలో కూడా ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అణువులో ఉన్నదే  బ్రహ్మాండములో ఉన్నదనునది మంత్రం శాస్త్ర సిద్దాంతం. అంటే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన దేవీ చైతన్యం మన శరీరంలో లేకపోతే ఈ శరీరంలో అసలు కదలికలే ఉండవు. చైతన్యం అంతకంటే ఉండదు. శ్రీచక్రంలోని చక్రములన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. కనుక మన శరీరంలో ఉన్న శ్రీచక్ర దేవతను ఆరాధించటానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఉపయోగపడుతుంది.

ఒకేసారి ఒకే  వ్యాసంతోనే గోధుమపిండి దీపారాధన ప్రతి ఆదివారం చేయండి అని ఒక్క ముక్కలో చెప్పవచ్చును. కాని ఇలా ఎందుకు చేయాలి అని సవివరంగా చెప్పటానికై, పాఠకులకు పరిపూర్ణమైన అవగాహన మరింత మెరుగుగా ఉండాలనే ఆలోచన తోటే  ఇంత సుదీర్ఘ వ్యాసాన్ని అందిస్తున్నాను. మరో రెండు వ్యాసాలతో గోధుమపిండి దీపారాధన పూర్తి వివరాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. – శ్రీనివాస గార్గేయ

You may also like

5 comments

Avatar
వెంకటేశ్వర్లు October 28, 2022 - 11:30 pm

Very good information sir

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 11:06 am

subham

Reply
Avatar
Kiran Mai October 29, 2022 - 1:54 pm

Good

Reply
Avatar
gargeyaastro October 29, 2024 - 11:06 am

subham

Reply
Avatar
Kiran Mai October 29, 2022 - 1:55 pm

Bagundi

Reply

Leave a Reply to వెంకటేశ్వర్లు Cancel Reply